ఏపీలో వాలంటీర్ వ్యవస్థకు మంగళం పాడేనా?, ఏపీ పెన్షన్ల పంపిణీ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ సర్కార్ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి సచివాలయ వ్యవస్థతో పింఛన్లు పంపిణీ చేపట్టారు.
ఈ క్రమంలో మాట్లాడిన పవన్..వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ఏం ఆగిపోదన్నారు. వాలంటీర్‌లు ప్రభుత్వానికి ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉండాలని… అలాంటి వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం ఏం చేయలేదనే వాదన సరికాదని తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ లేకపోయినమంత మాత్రం ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చొదని… అలాగని ఇప్పటి వరకు పని చేసిన వాలంటీర్లకు కచ్చితంగా ప్రత్యామ్నాయాలు చూపిస్తామని చెప్పారు పవన్.
ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై పలు అనుమానాలు నెలకొనగా పవన్ చేసిన కామెంట్స్ ఆ అనుమాలకు బలం చేకూర్చినట్లు అయిందని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా వాలంటీర్లకు ఇచ్చే జీతాలను ఐదు నుంచి పది వేలకు పెంచుతామని చెప్పారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక వాలంటీర్లతో కాకుండా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేపట్టారు. దీంతో రానున్నకాలంలో వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడటం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.