సూపర్ సిక్స్ లేదు… సూపర్ సెవెన్ లేదు..రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించే పరిస్థితి నెలకొందన్నారు వైసీపీ చీఫ్ జగన్. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి రాజమహేంద్రవరంలో తనపై వ్యవహరించిన అమానవీయ ఘటనను వివరించారు దళిత యువకుడు పులి సాగర్. ఈ సందర్భంగా సాగర్‌కు పూర్తిస్ధాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
ప్రజల తరఫున గళం విప్పాల్సిన సమయం వచ్చింది…. అనుకున్న దానికంటే ముందుగానే ఆసమయం వచ్చిందని తెలిపారు. పార్టీ నాయకత్వం రంగంలోకి దిగాలని…విద్యుత్ ఛార్జీలు పెంపు, ధాన్యం సేకరణలో దళారీల రాజ్యం, మద్దతు ధర లభించకపోవడం, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలపై పోరుబాట పట్టాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. మండలం, నియోజకవర్గాలు, జిల్లా స్థాయి మూడు స్థాయిల్లో ఆందోళనలపై కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 6 నెలల వ్యవధిలోనే ఇంతటి వ్యతిరేక ఎప్పుడూ, ఎక్కడా చూడలేదని చెప్పారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నీరుగారిపోయాయి.. దిగజారిపోయాయి అని ఆరోపించారు. రైతులకు ధాన్యం సేకరణలో కనీస మద్దతు ధర లభించడం లేదు. చంద్రబాబు పాలనలో రైతులు పూర్తిగా దెబ్బతిన్నారు అని దుయ్యబట్టారు. కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు.. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో కరెంట్ ఛార్జీల బాదుడు ఎవరూ చేపట్టలేదని విమర్శించారు జగన్.