తెలంగాణలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీంతో వెనక్కి తగ్గింది కాంగ్రెస్ పార్టీ. ఇక తాజాగా ప్రధానమంత్రి మోడీ చేసిన కామెంట్స్‌తో మళ్లీ కాకపుట్టగా హెచ్‌సీయూ భూముల వ్యవహారంలో తప్పుడు సమాచారాన్ని షేర్ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.
ఈ నేపథ్యంలో ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులపై ఎక్స్ వేదికగా స్పందించారు స్మితా. గచ్చిబౌలి పోలీసులకు తాను పూర్తిగా సహకరించినట్లు చెప్పారు.
చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆ పోస్టును తాను రీపోస్టు చేసినట్లే 2 వేల మంది షేర్ చేసినట్లు పేర్కొన్నారు. వాళ్లందరిపైనా ఇలాంటి చర్య తీసుకుంటారా..? చట్టం అందరికీ సమానమా.. ? ఎంపిక చేసిన వారినే టార్గెట్ చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత కోరినట్లు స్మితా సబర్వాల్ తెలిపారు.
మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన గిబ్లి తరహాలో ఉన్న ఇమేజ్‌ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. సేవ్ హైదరాబాద్, సేవ్ హెచ్‌సీయూ బయోడైవర్సిటీ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో మష్రూమ్ రాక్ ఎదుట భారీ సంఖ్యలో బుల్డోజర్లు మోహరించగా, బుల్డోజర్లకు ఎదురుగా నెమలి, జింకలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇది ఫేక్ ఫొటో అంటూ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే.