దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైన తిరుపతి లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది న్యాయస్థానం. ఐదుగురు సభ్యులతో SIT ఏర్పాటు చేసి అందులో CBI నుంచి ఇద్దరు, SIT (రాష్ట్రం) నుంచి ఇద్దరు, FSSAI నుంచి ఒక నిపుణుడిని ఉంచాలని సూచించింది. CBI డైరెక్టర్ పర్యవేక్షణలో విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
టీటీడీ లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై విచారణ జరిపింది న్యాయస్థానం. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి కీలక ఆదేశాలు ఇచ్చింది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని, పొలిటికల్ డ్రామాలకు అనుమతి ఇవ్వమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించగా.. కేంద్రం తరపున సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతా, టీటీడీ తరపున సిద్ధార్థ్ లూథ్రా, వైవీ సుబ్బారెడ్డి తరపున కపిల్ సిబల్ తమ వాదనలు వినిపించారు. నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరాన్ని కపిల్ సిబల్ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.