Sunday, May 4, 2025
- Advertisement -

తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు

- Advertisement -

రాష్ట్ర విభజన అనంతరం పరిపాలనా సౌలభ్యం, రెండు రాష్ట్రాల్లో సంస్థలకు ఒకే పేరు కారణంగా ఎదురవుతున్న గందరగోళానికి తెరదించాలన్న ఉద్దేశంతో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి పేరును పెడుతున్నట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత పదేళ్లుగా ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, విధివిధానాలు పరిశీలించిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయ పేరు మార్పును ప్రతిపాదించామని చెప్పారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్పు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై శానససభలో ముఖ్యమంత్రి స్పందించారు. పొట్టి శ్రీరాములు స్వాతంత్య్రోద్యమంలో మహాత్మ గాంధీ స్ఫూర్తితో పోరాటాలు చేసి ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాల ద్వారానే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిందని గుర్తుచేశారు. పొట్టి శ్రీరాములు పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. వారి దేశభక్తి, ప్రాణత్యాగం మరువలేనిదని అన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు కృషి చేసిన ప్రముఖులను మనం స్మరించుకుంటున్నాం, వారి పేర్లను మన విద్యా సంస్థలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు పెట్టుకుంటున్నాం. ఈ విషయంలో కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. రాష్ట్ర విభజన తర్వాత ఆయా భౌగోళిక ప్రాంతాల్లో ఉన్న యూనివర్సిటీలు ఆయా రాష్ట్రాల పరిధిలోకి వెళ్లగా, ఆ ప్రక్రియలో భాగంగా యూనివర్సిటీలకు కొత్త పేర్లు పెట్టుకోవడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ పేరు కొనసాగిస్తున్నారు. తెలంగాణలో దానికి కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేసుకున్నాం అన్నారు.

ఇలా మార్చడం వల్ల ఎన్టీఆర్ గారిని అగౌరవపరిచినట్టు కాదని, రెండు రాష్ట్రాల్లో ఒకే పేరుతో యూనివర్సిటీలను కొనసాగిస్తే పరిపాలనలో గందరగోళం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటీ పేరును కాళోజీ నారాయణరావు పేరును పెట్టుకున్నాం…ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రొ. జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వ్యవసాయ వర్సిటీ రంగా గారి పేరుతో కొనసాగుతోంది.

రాష్ట్ర విభజన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌లో యధాతథంగా కొనసాగుతుండగా, తెలంగాణలో హార్టికల్చర్ వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ కొనసాగుతుండగా తెలంగాణలో వెటర్నరీ యూనివర్సిటీకి స్వర్గీయ పీవీ నరసింహారావు పేరును పెట్టుకున్నాం అన్నారు.

ఈ కోవలోనే రాష్ట్ర విభజన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్‌లో పొట్టి శ్రీరాములు పేరుతో కొనసాగుతుండగా, తెలంగాణలో సురవరం ప్రతాప రెడ్డి పేరును ప్రతిపాదించాం. ఈ మార్పు ఒక వ్యక్తి కోసమో, కుటుంబం కోసమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు. మిగతా యూనివర్సిటీలకు పేర్లను ఎలా మార్చుకున్నామో అదే తరహాలో తెలుగు విశ్వవిద్యాలయానికీ మార్పు ప్రతిపాదన చేశాం అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీఎస్ ఆర్టీసీని టీజీఆర్టీసీగా, ఏపీఐఐసీని టీజీఐఐసీగా, ఏపీపీఎస్సీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా మార్చుకున్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలనలో భాగంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో యూనివర్సిటీల పేర్లకు మార్పులు చేశాం అన్నారు.

ఈ నిర్ణయాల్లో ఎవరినో కించ పరచాలన్న ఉద్దేశం కాదు. పరిపాలన పరంగా ఎదురయ్యే ఇబ్బందులను తొలగించాలని, రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. పొట్టి శ్రీరాములు , మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ రోశయ్య పట్ల, ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉంది అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -