కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి మాట మార్చింది. ఇప్పటికే పలుమార్లు సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం కష్టంగా ఉందని తెలపగా తాజాగా అసెంబ్లీ వేదికగా మంత్రి అచ్చెన్నాయుడు కుండబద్దలు కొట్టారు.
అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి కేవలం ₹14,000 మంజూరు చేస్తామని ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం కేంద్రం అందించే సాయంతో కలిపి ₹6,000 సహా మొత్తం ₹20,000 రైతులకు అందజేస్తామని చెప్పింది. కానీ తాజాగా కేవలం రూ.14 వేలు మాత్రమే ఇస్తానని తెలిపారు అచ్చెన్నాయుడు.
అన్నదాత సుఖీభవ పథకం చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైన సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి. అయితే తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో రైతులు తీవ్రంగా నిరాశలో ఉన్నారు. ప్రభుత్వ ప్రకటన రైతులను మోసం చేయడమేనని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి మండిపడ్డారు. రైతులను మోసం చేయడమే ఎన్డీయే ప్రభుత్వ విధానామా అని మండిపడ్డారు.
రైతుల విషయంలో హామీ వెనక్కి తీసుకున్న ఎన్డీయే ప్రభుత్వం, మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా పరిమితం చేస్తూ కొత్త నిబంధనలు ప్రకటించింది. శాసనమండలిలో మంత్రి గుమ్మడి సంద్యారాణి ఇందుకు సంబంధించిన ప్రకటన చేశారు. ఇప్పటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రవ్యాప్తంగా కాకుండా, మహిళలు వారి సొంత జిల్లాలో మాత్రమే ఉచితంగా ప్రయాణించవచ్చు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయాలతో రైతులు, మహిళలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.