టీడీపీ – జనసేన మధ్య ఎట్టకేలకు సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో దాదాపు మూడున్నర గంటల పాటు సమావేశమైన పవన్..ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల పంపకాలపై దాదాపు ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.
జనసేన వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 15 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో పార్టీ మారే నేతలు, చేరికలపై ఓ క్లారిటీకి వచ్చినట్లు ఇరు పార్టీల నేతలు తెలిపారు.
వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేయగా జనసేన తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉండగా ఈ సీటును జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం. అలాగే ఇరు పార్టీల మధ్య నువ్వా,నేనా అన్నట్లు ఉన్న నియోజకవర్గాలు పిఠాపురం, విజయవాడ వెస్ట్, చీరాల, దర్శి, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రూరల్, తిరుపతి, మాడుగుల, పోలవరం, పెడన, నంద్యాల, అనంతపురం రూరల్, ధర్మవరం, కళ్యాణదుర్గం, పూతలపట్టు వంటి నియోజకవర్గాలను జనసేనకు కేటాయించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా సీట్ల సంఖ్య ఫైనల్ కావడంతో ఇక త్వరలోనే ఇరు పార్టీల తొలి లిస్ట్ వచ్చే అవకాశం ఉంది.