వైసీపీ హయాంలో జరిగిన మంచి పనులను తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పచ్చ పార్టీ నేతలు. ఇందుకు వారికి భజన చేసే ఎల్లో మీడియా ఉండనే ఉంది. ఇంకేముంది అంతా తామే చేసినట్లు గోబెల్స్ ప్రచారమే. అయితే ఇది కొన్ని సందర్భాల్లో బుమారాంగ్ అవుతున్న టీడీపీ నేతలు మాత్రం అసత్యాలను ప్రచారం చేయడంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
ఇప్పటికే వరదలకు సంబంధించి వాస్తవాలేంటో తెలుసుకోకుండా..చంద్రబాబు అది చేశారు, ఇది చేశారు అని ఎల్లో మీడియాలో ప్రచారం చేయించి నవ్వుల పాలు అయ్యారు టీడీపీ నేతలు. అమరావతి రాజధాని మునిగిపోకుండా విజనరీ చంద్రబాబు కొండవీడు వాగులోంచి నీటిని కృష్ణానదిలోకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పంపింగ్ చేయిస్తున్నారని డబ్బా కొట్టింది. కానీ తీరా చూస్తే కొండవీడు వాగులోకి రివర్స్‌లో కృష్ణా నీరు వస్తుండడంతో ఇరిగేషన్ అధికారులు ఆ నీటిని రాకుండా ఇసుక బస్తాలు వేసి ఆపే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక తాజాగా తెలుగుదేశ పార్టీ అఫిషియల్ ఎక్స్‌లో విజయవాడ రిటైనింగ్ వాల్‌కు సంబంధించి షేర్ చేసిన న్యూస్‌తో చంద్రబాబు గోబెల్స్ ప్రచారంలో ఎంత సిద్దహస్తుడో తేలిపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే 2019 మార్చిలోనే మీ చంద్రబాబు ఆ రిటైనింగ్ వాల్‌ను కట్టి ఉంటే.. మరి అదే ఏడాది ఆగస్టులో వచ్చిన వరదలకి కృష్ణలంక ఎందుకు మునిగిపోయింది? అని ప్రశ్నిస్తున్నారు.
చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నా వైయస్ జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ చెక్కు చెదరలేదు అని గుర్తు చేస్తున్నారు. అందుకే కృష్ణలంక వాసులు తమ ప్రాణాల్ని కాపాడిన వైయస్ జగన్ కి కృతజ్ఞతలు చెప్పారని ఇందుకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు. కృష్ణలంకకు టీడీపీ నేతలు వెళ్తే అసలు నిజం తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. జగన్ చేసిన పని క్రెడిట్..చంద్రబాబు ఖాతాలో వేయడం సరికాదని హితవు పలుకుతున్నారు నెటిజన్లు.