ఏపీని వరదలు ముంచెత్తాయి. వరదలతో విజయవాడ అతలాకుతలం కాగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. వరద ఉద్ధృతిపై అప్రమత్తం చేసి ఉన్నా.. జాగ్రత్తలు తీసుకునేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి తిండి, నీరు లేదని.. కూటమి నేతలు తమని అస్సలు పట్టించుకోలేదని మీడియా ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు.
వరదల కారణంగా మేము సమస్యలతో సతమతమవుతుంటే మమ్మల్ని కనీసం పరామర్శించడానికి కూడా ఎమ్మెల్యే రాలేదని పాత రాజేశ్వరిపేట వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ వచ్చి ఇక్కడికి సహాయం చేయకపోగా వాళ్ల పబ్లిసిటీ కోసం కొంతమంది వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్తున్నారన్నారు. కనీసం వాలంటీర్లు అయినా ఉండి ఉంటే మాకు సహాయం అందేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కరకట్టపై జలదిగ్భందంలో చిక్కుకుంది చిగురు బాలల ఆశ్రమం. అక్రమంగా నిర్మించిన ఇంటికి సమాంతరంగా ఉంది చిగురు బాలల ఆశ్రమం. చంద్రబాబు ఇంట్లోకి కూడా భారీగా చేరిన వరద నీరు.. కానీ అటువైపు ఎవ్వరినీ రానివ్వకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. వరద నీరు వస్తుందని తెలిసి నిన్నే ఆ ఇంట్లో నుంచి బయటికి చంద్రబాబు వచ్చేశారని ఆరోపిస్తున్నారు.
రెండు రోజులుగా వరద నీటిలో నానా కష్టాలు పడుతున్నా తమను ఎవరూ పట్టించుకోలేదని భవానిపురం వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు అనేకసార్లు ఓట్లు కోసం వచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు ఇటువైపు కన్నెత్తికూడా చూడడం లేదంటున్నారు. ప్రభుత్వ చర్యలు శూన్యం అని, సహాయక చర్యలు చేపట్టడడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు.