అల్లు అర్జున్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆరు గంటల పాటు సాగిన అల్లు అర్జున్ అరెస్ట్…. రిమాండ్…బెయిల్ ఎపిసోడ్‌లో మధ్యంతర బెయిల్ మంజురు చేసింది న్యాయస్థానం.
తొలుత నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 27 వరకు కస్టడీ విధిస్తూ 9వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. అనంతరం అక్కడ హాజరుపర్చిన తర్వాత బెయిల్ దక్కే అవకాశం ఉంది. జైలు సూపరింటెండెంట్ కి వ్యక్తిగత పూచీకత్తు సమర్పించి మధ్యంతర బెయిల్ తీసుకోవాలని, పూర్తి బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నెల 4న పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు గాయపడ్డాడు. మృతురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్టు చేయగా అల్లు అర్జున్ ఏ-11గా ఉన్నారు.