తెలంగాణ రుణమాఫీపై కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతలతో సమావేశం సందర్భంగా మాట్లాడిన రేవంత్..తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామన్నారు. వ్యవసాయం అంటే దండగ కాదు పండగని…అందుకే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో రుణమాఫీపై చర్చ జరిగేలా చూడాలన్నారు.
తొలి విడతలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తున్నామని ఇందుకు రూ.7 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. రెండో విడతలో లక్షన్నర వరకు, మూడో విడతలో 2 లక్షల రూపాయల వరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామన్నారు.
2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారని…ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురైన రుణమాఫీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించిన రేవంత్…. వ్యవసాయ విధానంలో తెలంగాణ మోడల్ ను దేశం అనుసరించేలా ఉండాలన్నారు. రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికే రూ.2లక్షల రైతు రుణమాఫీ అని మరోసారి స్పష్టం చేశారు రేవంత్.