పెద్దలను వదిలేసి పేదలపై ప్రతాపం చూపించడం ఏంటని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. పెన్షన్ల తొలగింపు పై మండలిలో మాట్లాడిన త్రిమూర్తులు.. వివిధ రూపాల్లో లక్షలు..కోట్లు దోచేస్తున్న వాళ్లను వదిలేసి పేదలపై పడటం బాధాకరమన్నారు.
పెన్షన్లను పెంచుతామని చెప్పి తొలగించడం ఏంటని మండిపడ్డారు. రాజకీయ కారణాలతో 2 లక్షల పింఛన్లు తొలగించడం అన్యాయమని…రకరకాల నిబంధలు పెట్టి దివ్యాంగుల పెన్షన్లు తొలగించారన్నారు. పేదలకు ఇచ్చే పెన్షన్లను భూతద్దం పెట్టి వెతికి తొలగించడమ దారుణమని వెంటనే అర్హులైన వారందరికి పెన్షన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో కూటమికి ఓటు వేయలేదని కక్షగట్టి సామాజిక పింఛన్లు తొలగించారని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలిపారు. తొమ్మిది నెలల్లో రెండు లక్షల పెన్షన్లు తొలగించి, రికార్డుల్లో 14,965 మాత్రమే తొలగించామని చెప్పడం సరికాదన్నారు. పెన్షన్ల తొలగింపులో దివ్యాంగులకు 15 రోజుల్లో సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నారని, సదరన్ వెరిఫికేషన్ స్లాట్ దొరకడానికే నెలరోజుల సమయం పడుతుందన్నారు. పెన్షన్లు తొలగింపులో మానవీయకోణంలో ఆలోచన చేయాలని కోరారు.