టీటీడీ గోశాలలో గోవుల మృతిపై వైసీపీ వర్సెస్ టీడీపీ వయా టీటీడీ బోర్డు మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయగా టీడీపీ నేతలు సైతం అంతే ఘాటుగా స్పందించారు. ఇక టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ ఒకడుగు ముందుకేసి భూమనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీటీడీ గోశాలలో గోవుల మృతిపై ఇన్ని నాటకాలు అవసరమా చంద్రబాబు? అని అంతా ప్రశ్నిస్తున్నారు. తొలుత ఆవులు చనిపోవడం అబద్ధం.. వైయస్‌ఆర్‌సీపీది ఫేక్ ప్రచారమని టీటీడీతో పోస్టు పెట్టించారు. ఆ తర్వాత ఏం ఇంట్లో మనుషులు చనిపోవడం లేదా..? అలానే ఆవులూ చనిపోతాయంటూ, ఒక 20 ఆవులు చనిపోయాయి దాంట్లో ఏముంది అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెటకారం చేశారు.
ఆవులు చనిపోవడం చాలా కామన్ అంటూ టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ తీసికట్టుగా మాట్లాడాడు . గోవులు చనిపోవడం మీ కళ్లతో చూశారా? ఒక్క ఆవు మాత్రమే చనిపోయింది అంటూ టీడీపీ బ్రాహ్మణ సాధికారసమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ వెటకారం చేస్తారు. బాగుండే మనుషులే చనిపోతున్నారు.. ఆవులు ఒక లెక్క, 40 ఆవులు చనిపోయాయంటూ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వేదాంతం చెప్తారు.
గోశాలలో ఆవులు చనిపోకపోయినా.. చనిపోయాయంటూ వైయస్ఆర్ సీపీ వాళ్లు బాధపడిపోతున్నారని చంద్రబాబు వెటకారంగా మాట్లాడతారు. గోవుల మరణాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నారా లోకేష్ ట్వీట్ తో నాటకాలు వేస్తారు. అవును..ఈ మూడు నెలల్లో 43 గోవులు చనిపోవడం నిజమే అని టీటీడీ ఈవో శ్యామల రావు చెప్తారు. టీటీడీ గోశాలలో ఏ తప్పూ జరగకపోతే… ఎందుకు ఇంత గందరగోళం కానీ ఇది చెప్పలేని పరిస్థితిలో కూటమి నేతలు ఉన్నారు.