మోడీ 3.0 అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. ఇక బడ్జెట్‌లో ఏపీ, బీహార్‌కు పెద్దపీట వేశారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, అవసరమైతే మరిన్ని కేటాయింపులు ఉంటాయని చెప్పారు నిర్మలా. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని, విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక రాయితీలు వంటి అంశాలను ప్రస్తావించారు. ఇక ప్రతిపక్షాలు సైతం కేంద్ర బడ్జెట్ కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితమైందని విమర్శలు చేశారు.
ఇక ఏపీకి బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కడంపై ఇటు టీడీపీ, అటు జనసేన నేతలు ఈ క్రెడిట్ తమదంటే తమదని డబ్బా కొట్టుకుంటున్నారు. ఏపీపై కేంద్రం వరాల జల్లు ప్రకటించడం వెనుక పవన్ చొరవ, త్యాగం ఉందని సోషల్ మీడియాలో ఓ వర్గం చర్చలేపింది. పవన్ వల్లే కూటమి పొత్తు సాధ్యమైందని, పొత్తుతో తనకు నష్టం జరిగినా పవన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదన్నారు. దీనిని ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా గుర్తించడం అందరికి తెలిసిన విషయమేనని అందుకే పవన్‌ని తుఫాన్ అని మోడీ సంబోధించారని చెబుతున్నారు.
పవన్ క్రెడిట్ వల్లే ఏపీకి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని చెబుతుండగా టీడీపీ నేతలు సైతం చంద్రబాబు మార్క్ వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. ఇక ఇప్పుడు ఏపీ అభివృద్ధికి సంబంధించి గతంలో పవన్ చేసిన కామెంట్స్‌ని వైరల్ చేస్తూ ఇదంత జనసేనాని వల్లే సాధ్యమైందని చెప్పే ప్రయత్నం చేస్తుండటంతో కూటమిలో అప్పుడే ముసలం మైదలైందా అనే టాక్ వినిపిస్తోంది.