తిరుపతి ఘటనకు చంద్రబాబే బాధ్యుడని ఆయనకు సీఎం పదవిలో కొనసాగే అర్హత ఏ మాత్రం లేదు అని మండిపడ్డారు వైసీపీ నేత వంగవీటి నరేంద్ర. చంద్రబాబును పదవి నుంచి తప్పించాలని రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిని కోరారు. చంద్రబాబు వల్ల ఇప్పటికే ఎందరో అమాయకులు బలి అయ్యారని…ఇప్పటికైనా ఈ దారుణాలకు ఫుల్‌స్టాప్ పడాలి అన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎంతో పాటు, టీటీడీ ఛైర్మన్, ఈఓపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి గోదావరి పుష్కరాల్లో 29 మంది బలి కాగా, ఆ తర్వాత కందుకూరులో మీటింగ్‌లో 7గురు, ఆ తర్వాత గుంటూరులో మరో ముగ్గురు చనిపోయారని గుర్తు చేశారు.
వరుసగా ఇన్ని ఘటనలు జరుగుతున్నా చంద్రబాబుపై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయడం లేదని, అందుకే దానిపై జాతీయ మానవ హక్కుల సంఘాని (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేశామని నరేంద్ర వెల్లడించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో కూడా ఒక వర్గానికి చెందిన అధికారులను కాపాడుతూ, సంబంధం లేని వారిపై చర్య తీసుకోవడం దారుణమని అన్నారు.