ఎంతమంది పార్టీ వీడినా తామంతా జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు వైసీపీ నేతలు. పార్టీ వీడుతామని తమపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు అయోధ్య రామిరెడ్డి, విజయ సాయిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వచ్చే నష్టం ఏమీ ఉండదని అయోధ్య రామిరెడ్డి అన్నారు.
తాము పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. స్వలాభం కోసం కొంతమంది పార్టీ మారితే తాము ప్రజల కోసమే నిలబడతామని చెప్పారు. జగన్ తమకు ఎలాంటి అన్యాయం చేయలేదన్నారు. జగన్ తనను ఎంతగానో గౌరవించారని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. .కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు వైఎస్సార్ వెంటే ఉన్నాను..ఆ తర్వాత జగన్ వెంట నడిచానని తెలిపారు. ఆర్థికంగా పేదవాడినే అయినా విధేయతలో సంపన్నుడునే అన్నారు.
ఇలాంటి క్లిష్ట సమయంలో తాను రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టేనని…. అలాంటి కృతజ్ఞ హీనులం కాదు అన్నారు. అధికారం శాశ్వతం కాదు, జయాపజయాలు సహజమే… వైఎస్సార్‌సీపీ ఇవాళ ఓడిపోయినంత మాత్రాన నేను పార్టీ వీడి వెళ్లను అని స్పష్టం చేశారు. జగన్ నాయకత్వంలోనే పని చేస్తానని… రాజకీయాల్లో ఉన్నంతకాలం వైసీపీలోనే ఉంటానని తెలిపారు చంద్రబోస్.
అన్నీ అనుకున్నట్టే జరగాలనుకుంటే రాజకీయాల్లో కుదరదని చెప్పారు అయోధ్య రామిరెడ్డి. తాను వైసీపీని వీడే ప్రసక్తే లేదని.. ఎలాంటి పరిణామాలు ఎదురైనా జగన్ వెంటే ప్రయాణం చేయాలని రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. సామాన్యుల కోసం ఆలోచించే వ్యక్తి జగన్ అని… వాళ్ల కోసమే జగన్ పార్టీ పెట్టారని చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారని …అంకితభావం, నిబద్ధత కలిగిన కార్యకర్తనని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తానని తేల్చి చెప్పారు.
రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నానని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ… పదవులు, ఆర్థిక అవసరాల కోసమే కొందరు వైసీపీని వీడుతున్నారని… వాళ్ల మాదిరి తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పారు. జగన్ తనను గౌరవించారని… అందుకే తొలి నుంచి ఆయనకు మద్దతుగా ఉన్నానని అన్నారు.