ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన భద్రతను క్రమక్రమంగా కుదించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. తనను అంతమొందించే కుట్ర జరుగుతోందని అందుకే భద్రతను తగ్గించారని ఆరోపించారు. 3-6-2024 తేది నాటికున్న భద్రతను పునరుద్దరించేలా ఆదేశాలివ్వాలని కోరారు.
టీడీపీ నేతలు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్న పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తగ్గించారని ఆరోపించారు. ఆఫీస్‌తో పాటు ఇంటి వద్ద సెక్యూరిటీని పూర్తిగా తొలగించారన్నారు. ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతాధికారులే ఉన్నారు అని న్యాయస్థానానికి తెలిపారు.
తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగాలేదని, సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకుంటానన్న అనుమతివ్వలేదని వివరించారు. భద్రత కుదింపుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ఎలాంటి స్పందన రాలేదన్నారు. తన స్వేచ్ఛను ప్రమాదంలోకి నెట్టేందుకు ఏకపక్షంగా భద్రతను కుదరించారన్నారు. అలాగే స్పీకర్ తన గురించి మాట్లాడిన వ్యాఖ్యలను ప్రస్తావించారు జగన్. తాను ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయానని, ఇంకా బతికే ఉన్నానని, చచ్చేవరకు కొట్టాలని మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందన్నారు.
ఎన్నికల ప్రచార సమయంలో రాయితో దాడి అంతకముందు కోడికత్తితో హత్యాయత్నం వీటన్నింటిని దృష్ట్యా 3-6-2024 నాటికి ఉన్న భద్రతను పునరుద్దరించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవల ఓ పర్యటను వెళ్తుండగా మధ్యలో కారు ఆగిపోవడంతో అర్థాంతరంగా వెనక్కి రావాల్సి వచ్చిందని, సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడుకునేలా అనుమతివ్వాలని కోరారు.