పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 17 మంది అభాగ్యులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం వార్త విని తీవ్రంగా షాక్‌కు గురయ్యాను… తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఎక్స్ వేదికగా తెలిపారు.
పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించి కాపాడాలని,మరణించిన వారి కుటుంబాలకు తగు ఆర్థికసాయం చేసి అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ సూచించారు.
హైదరాబాద్లోని పాత బస్తీలో గుల్జార్ హౌస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాదం పై మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక కుటుంబాలతో ఫోన్ లో పరామర్శించారు సీఎం. మంటల్లో చిక్కుకున్న వారందరినీ కాపాడుతామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఆదేశించారు. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డిని ఆదేశించారు సీఎం.
హైదరాబాద్ చార్మినార్ పరిధిలోని గుల్జార్హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఎక్స్రేషియా ప్రకటించిన ప్రధాని, గాయపడ్డ వారికి రూ.50,000 అందిస్తామన్నారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.