ఎన్నికలకు ముందు ఉచితమని చెప్పి ఇప్పుడు కండీషన్స్ పెట్టడం సరికాదన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులంటూ ప్రభుత్వం నిబంధన పెట్టనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కూటమి సర్కార్ క్లారిటీ ఇవ్వాలన్నారు.
ఏరు దాటేంత వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్నారని ఇపుడు షరతులు వర్తిస్తాయని అనడం దారుణమని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటినా ఉచిత బస్సు ప్రయాణం కల్పించకుండా కమిటీల పేరుతో కాలయాన చేస్తున్నారని మండిపడ్డారు.
పథకం అమలుకు ముందే ఇన్ని నిబంధనలు పెట్టిన ఈ ప్రభుత్వం.. రేపు పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చేసరికి నియోజకవర్గం, మండల పరిధి వరకే ఉచిత ప్రయాణం అంటుందేమో అంటూ ఆమె ఎద్దేవా చేశారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా లాభనష్టాలు చూడాలా అని ప్రశ్నించారు. తక్షణం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు షర్మిల.