పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కొత్త పేరు పెట్టారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్‌పై స్పందించిన షర్మిల..మత పిచ్చి బీజేపీ ఆశయాలను పవన్ కల్యాణ్ అలవరుచుకోవడం దురదృష్టకరం అన్నారు.
పవన్ కల్యాణ్.. చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారు. ఇప్పుడు ఆయన మోడీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారు అని మండిపడ్డారు. RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారు అందుకే జనసేన పార్టీని ఆంధ్ర మతసేనా పార్టీగా మార్చారు అని దుయ్యబట్టారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా పవన్ మేల్కోవాలని, బీజేపీ మైకం నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు . పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం అన్నారు.