కరెంట్ ఛార్జీల పెంపుపై ఆందోళన బాట పట్టింది ఏపీ కాంగ్రెస్. విద్యుత్ ఛార్జీలపై గత ప్రభుత్వం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయాల్సింది పోయి.. ఆ పాపపు పరిహారాన్ని ప్రజల నెత్తినే మోపుతోంది ఇప్పటి కూటమి సర్కార్ అని మండిపడ్డారు వైఎస్ షర్మిల.
విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు షర్మిల. రూ.18వేల కోట్ల సర్దుబాటు ఛార్జీలు వసూళ్ళ విషయంలో .. మా తప్పేం లేదని, మాకసలు సంబంధమే లేదని, భారం మాది కాదని, ప్రజల మీదే ఆ మొత్తాన్ని మోపుతున్నారు. సర్దుబాటు కాదు ఇది.. ప్రజలకు “సర్దుపోటు”. కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన భారీ కరెంటు షాక్ అని దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. 5 నెలల్లోనే ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. అత్యంత దారుణంగా కరెంటు చార్జీల భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే రూ.6 వేల కోట్ల భారం మోపారు. ఇది చాలదు అన్నట్లు ఇంకో రూ.11వేల కోట్లు సిద్ధం చేశారు. మొత్తం రూ.17 వేలకోట్లు సర్దుబాటు కింద మోపుతున్నారు. ప్రజలు ఏం పాపం చేశారు చంద్రబాబు అని మండిపడ్డారు.
ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేస్తే ఊరుకోమని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ హెచ్చరించింది. ప్రజల ముక్కు పిండి ట్రూ అప్ ఛార్జీల రూపంలో, అధిక కరెంటు బిల్లులు వసూళ్లు చేస్తున్నందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిస్తున్నాం అన్నారు.