వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల సమన్వయ సమావేశం జరిగింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇంచార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన చెవిరెడ్డి… పార్టీని బూత్ లెవల్‌నుంచి సంస్ధగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకం యుద్దప్రాతిపదికన పూర్తిచేయాలి అని సూచించారు.
అంకితభావం, కష్టపడేతత్వం, కెపాసిటీ ఉండే వ్యక్తులకు నియామకంలో ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు చెవిరెడ్డి. వైసీపీ అనుబంధ విభాగాలన్నీ పార్టీకి వెన్నెముకలాగా ఉండాలని వెల్లడించారు. ప్రజలకు మాట ఇచ్చి తప్పిన కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేక పోరాటాలకు సంసిద్దంగా ఉండాలి అని వెల్లడించారు.
ప్రజలను విస్మరించి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను జనంలోకి తీసుకెళ్ళడంలో అనుబంధ విభాగాలు కీలకపాత్ర పోషించాలి అన్నారు. పార్టీ అనుబంధ విభాగాలకు కూడా అవసరమైన శిక్షణా తరగతుల నిర్వహణపై సమావేశంలో చర్చ, త్వరలో శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.