2025-26 వార్షిక బడ్జెట్ రూ.3.22 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టింది చంద్రబాబు సర్కార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ. 33,185 కోట్లు, ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు.
ఇక కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైసీపీ మండిపడింది. ఈ బడ్జెట్‌తో ఎవరికీ ప్రయోజనం లేదని.. బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థలు పడుతున్నారు.రైతులు, మహిళలు, యువత అన్ని వర్గాలను విస్మరించారు. ధరల స్థిరీకరణ కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించింది. కూటమి ప్రభుత్వం కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెట్టింది’’ అని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వాన్ని తిట్టడం.. చంద్రబాబు, లోకేష్‌ని పొగడడం తప్ప ఏమీ లేదు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. కూటమి ఇచ్చిన వాగ్దానాల్లో అరకొరగా ఒకటి రెండు తప్ప ఏమీ చేయలేదు అన్నారు.
మహిళలకు 15 వందలు, విద్యార్థులకు 15వేలు, రైతుకు 20వేలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కేటాయింపులు మాత్రం అరకొరగా ఉన్నాయి అన్నారు. 81లక్షల మంది విద్యార్థులు ఉంటే 12వేల కోట్లు కావాలి.. కానీ కేటాయింపులు 9400 కోట్లు కేటాయించారు అన్నారు. మిగిలినవి ఏ విధంగా ఇస్తారు. ఎక్కడ సేకరిస్తారు? చెప్పలేదు అన్నారు.
చంద్రబాబు, లోకేష్ ని పొగిడేందుకే సభ సరిపోయింది. వెనుక బడిన తరగతుల అభివృద్ధి కి కేటాయింపులు లేవు. ఉత్పాదక రంగంపై కేటాయింపులు జరిగితే అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ రవిబాబు అన్నారు.ఇది పేదల వ్యతిరేక బడ్జెట్.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను మోసం చేశారు. జగన్ కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాకా ఒక్క హామీ అమలు చేయలేదు. గత ప్రభుత్వాన్ని తిట్టడం, లోకేష్‌ని పొగడడం పనిగా పెట్టుకున్నారు. లోకేష్‌ని పోగిడే దానిపై పెట్టిన శ్రద్ధ.. బడ్జెట్‌పై పెడితే బాగుండేది. బడ్జెట్‌పై చర్చలో హామీల అమలు గురించి ఒత్తిడి తీసుకొస్తామని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు.