తేమ శాతం పేరుతో రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది కూటమి ప్రభుత్వం. కృష్ణ, గోదావరి, డెల్టా పరిధిలో ఎక్కడకు వెళ్లినా కిలోమీటర్ల కొద్ది రోడ్లపై ధాన్యం రాశులు మీకు కనిపించడం లేదా? అని వైసీపీ నేతలు మంత్రి నాదెండ్ల మనోహర్‌ని ప్రశ్నించారు. కొనేవారి కోసం ఎదురు చూస్తున్న రైతులు మీకు కనిపించడం లేదా?, ఫెంగల్ తుఫానులో తడిసి ముద్దయిన ధాన్యం మీకు కనిపించడం లేదా?,తేమ శాతం వంకతో రైతులను ముపుతిప్పలు పెడుతున్న దళారులు మీకు కనిపించడం లేదా? అని వైసీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించారు.
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించలేకపోయారు కానీ.. ఇప్పుడొచ్చినీతులు చెబుతున్నారా?.. ఫెంగల్ తుఫాను వస్తుందని ప్రభుత్వానికి నాలుగు రోజులు ముందే తెలిసినా చర్యలు తీసుకోవడంలో విఫలమైన మీరా ఇప్పుడు మాట్లాడేది? వరి కోతలు ప్రారంభమైన నెల రోజులు అయినా రైతుల వద్ద ధాన్యం కొనే నాథుడు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మేము ఏదో బ్రహ్మండంగా చేస్తున్నామని చెబుతున్నారా? చెప్పాలన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నది మీకు తెలియదా చెప్పండి? బస్తాకు రూ.300– రూ.400 నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి రావడానికి కారణం మీరు కాదా? రైతులను ఆదుకోవడం విషయం పక్కన పెడితే కనీసం రైతులకు ధాన్యం సంచులు అందించలేకపోయినందుకు సిగ్గుపడండి? అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పారదర్శకంగా ధాన్యం కొనుగోలు జరిగింది. ఆర్బీకేల కేంద్రంగా ఈ క్రాప్ డేటా ఆధారంగా ధాన్యం సేకరించి తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. కళ్లాల నుంచి ధాన్యాన్ని తరలించేందుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు నాడు ప్రతీ జిల్లాకు రూ.కోటి కార్పస్ ఫండ్ కూడా ఇచ్చింది. తుఫాను ప్రభావిత జిల్లాల్లో ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచుల కొరత లేకుండా చూసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ ఒక్క రైతుకు తమకు మద్దతు ధర దక్కలేదని రోడ్డుమీదకు రాలేదు అని గుర్తు చేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం విత్తు నుంచి విక్రయం వరకు రైతును చేయి పట్టుకుని నడిపిస్తే.. మీరు గత ప్రభుత్వ పథకాలను నర్వీర్యం చేసి రైతులను నిండా ముంచారు. చంద్రబాబు హయాం (2014-19)లో 17.94 లక్షల మంది రైతుల నుంచి రూ.40,236.91 కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో (2019-24) 39.01 లక్షల మంది రైతుల నుంచి రూ.67,906.14 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇప్పుడు చెప్పండి రైతులను ఆదుకున్నది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? పంటకు మద్దతు ధర ఇచ్చింది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? రైతును రాజుగా నిలిపింది వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? చెప్పాలన్నారు.