ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ రాజకీయ దుమారాన్ని రేపాయి. వైసీపీ ఎమ్మెల్యేలను దొంగలతో పొల్చుతూ స్పీకర్ చేసిన కామెంట్స్‌ను రాజకీయాలకు అతీతంగా అందరూ తప్పుబడుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బహుజన శాసన సభ్యులను దొంగలని సంభోదించడం స్పీకర్ విజ్ఞతకు వదిలేస్తున్నా అన్నారు. ప్రజాస్వామ్యంలో దొంగలంటే ముఖ్యమంత్రిని వెన్నుపోటు పొడిచి కుర్చీ ఎక్కినోళ్లు,వేలంపాటలో సభ్యులను సరసమైనా ధరతో కొన్నోళ్లు అని పరోక్షంగా టీడీపీ నేతలకు చురకలు అంటించారు.
దొంగలు అంటే వైశ్రాయ్ హోటల్లో క్యాంపులు నడిపినోళ్లు,స్పీకర్ ను అడ్డుపెట్టుకొని పార్టీ పక్షనేతను పోటు పొడిచినోళ్లు,జయప్రదంగా పార్టీని, పార్టీ నిధిని దోచినోళ్లని స్పీకర్ గారు తెలుసుకోగలరని ఆశిస్తున్నా, మేమేమీ గోడలు దూకి, అర్ధరాత్రులు, అపరాత్రుల్లో సంతకం పెట్టలేదు…మా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నల రూపంగా సభ ముందుకు తీసుకొచ్చే క్రమంలో అసెంబ్లీ సిబ్బంది సూచన మేరకే సంతకాలు పెట్టాం కానీ దొంగలుగా కాదు అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయ్యన్న కొంతమంది ఎమ్మెల్యేలు సభకు దొంగల్లా వచ్చి వెళ్లిపోతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించారు. అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేశాక అసెంబ్లీ నుంచి గాయబ్ అయిపోతున్నారని నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే.