తెలుగు రాష్ట్రాల్లో కోనోకార్పస్ చెట్ల చుట్టూ ఉన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వాలు ఈ చెట్లను కొట్టేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వగా శాస్త్రవేత్తలు మాత్రం కోనోకార్పస్ చెట్లతో ఎన్నో లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని సూచించారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఈ అంశంపై యోగి వేమాన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏ.ఆర్. రెడ్డి మాట్లాడుతూ..కోనోకార్పస్ చెట్లు అధిక ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని, తక్కువ నీటి అవసరంతోనే జీవించగలవని, నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా హైవేలు, పట్టణ పచ్చదన ప్రాజెక్టులకు వీటిని అనుకూలంగా పేర్కొన్నారు. ఈ చెట్లు భూగర్భ జలాలను నాశనం చేస్తాయన్న ఆరోపణలకు శాస్త్రీయ ఆధారం లేదని చెప్పుకొచ్చారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కోనోకార్పస్ నాటకాన్ని నిషేధించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోనోకార్పస్‌పై నిషేధాన్ని ప్రకటించారు. వేల సంఖ్యలో చెట్లను తొలగించారు. నియంత్రిత స్థాయిలో, ప్రణాళికతో నాటితే కోనోకార్పస్ పట్టణ ప్రాంతాల్లో మంచి పచ్చదనం కలిగించే పరిష్కారంగా నిలవగలదని తెలిపారు. ఈ అంశంపై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఏఆర్ రెడ్డి తెలిపారు.