ఒకే సినిమాకు ఇన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చి కూర్చుంటే టైం అంతా గడిచిపోతుందని అప్పట్లో ప్రభాస్ మీద విమర్శలు వచ్చాయి. అయితే, ఆ ఒక్క ‘బాహబలి’ సినిమాతోనే వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాడు ప్రభాస్. అంతేకాదు, తన స్టార్ డమ్ ను అమాంతం పెంచేసుకుని నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో న్యూస్ అయిపోయాడు. బాహుబలి కోసం ఎంత సమయం వెచ్చించాడో అంతకు మించి ఎన్నోరెట్లు ప్రతిఫలం పొందాడు. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా దర్శకుడు రాజమౌళికి, నటీనటులు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, తమన్నా, అనుష్క, సత్యరాజ్ లకు తిరుగులేని ఇమేజ్ ను కట్టబెట్టాయి. ఎన్నో అవార్డులు సొంతంచేసుకునేలా చేశాయి.
ఇలా తన లక్కీ ఛాన్సులు కొట్టేసిన ప్రభాస్ కు రేంజ్ రోవర్ రూపంలో మరో బంపరాఫర్ వచ్చిపడింది. అదెలాగంటే, పెరిగిన తన స్థాయికి తగ్గట్టుగా ప్రభాస్ రేంజ్ రోవర్ ‘ఎస్.వి. ఆటోబయోగ్రఫీ’ ఎడిషన్ కార్‌ను బుక్ చేశాడట.
కానీ అనుకోని కారణాల వల్ల ఆ మోడల్ ను ప్రభాస్ కు డెలివరి చెయ్యలేకపోయిందట కంపెనీ. కాగా కంపెనీ నామ్స్ ప్రకారం కస్టమర్ కు అనుకున్న టైంలోగా కారును డెలివరి చెయ్యలేని పక్షంలో… కొత్త కారును ఇచ్చేంత వరకు వేరే కారును వాడుకోవడానికి ఫ్రీగా ఇవ్వాలని అనుకున్నారట. దాంతో ప్రస్తుతం ఓ రేంజ్ రోవర్ కారును ప్రభాస్ కు ఇచ్చారని తెలిసింది. మొత్తానికి ప్రస్తుతానికి ఓ కారును అయితే ఫ్రీగా నడిపించేస్తున్నాడు ప్రభాస్.. త్వరలోనే కొత్త కారులో ప్రభాస్ షికారుచెయ్యనున్నాడు.