రాయలసీమ రాజకీయాలు వేడెక్కాయి. అభివృద్ధి అంతా కోస్తా..అందులోనూ విజయవాడ కే పరిమితం అయిపోతోందన్న ఆందోళన ఓ వైపు.. అదే సందర్భంలో రాజకీయంగా చంద్రబాబు పుణ్యాన సాగుతున్న కొత్త సమీకరణలు మరోవైపు సీమలో కొత్త పరిణామాలకు అవకాశమిస్తున్నాయి.
రాయలసీమలో తాజా మార్పులతో జగన్ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే భావించాలి. సొంత సామాజికవర్గం, అందులోనూ అత్యంత సన్నిహితుడు చేజారిపోవడం ప్రతిపక్ష నేతను కూడా తీవ్రంగా కలిచివేసి ఉంటుంది.
అయితే చంద్రబాబు చాలా చురుగ్గా పావులు కదుపుతున్న తరుణంలో జగన్ ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపించడం లేదు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే క్యూలో ఉన్నారు. సైకిలెక్కేయడం ఖాయం చేసుకున్నారు. రాబోయే వారం రోజుల్లోగా వైఎస్సార్సీపీ అనేక ఎదురుదెబ్బలు తినాల్సి రావడం ఖాయం. అందులోనూ బలంగా ఉన్న ప్రాంతంలో ఆపార్టీకి ఇలా అనూహ్యంగా చుక్కెదురు కావడం ఫ్యాన్ పార్టీ శ్రేణులను కొంత కలవరపరుస్తోంది.
చంద్రబాబు ఓవైపు ఢిల్లీలో, మరోవైపు ఏపీలో ఏకకాలంలో రాజకీయ ఎత్తులు వేస్తున్నారు. ప్రతిపక్షనేతను అన్ని రకాలుగానూ ఇబ్బందులు పాలుజేసే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో డీకొట్టిన జగన్ కు మరోసారి క్లిష్టపరిస్థితులు తప్పేలా లేవు. అందులోనూ అండగా ఉన్న సామాజికవర్గం నుంచి కీలకనేతలు చేజారిపోతుండడంతో ఆ తర్వాత మిగిలిన నేతలపై ప్రభావం తప్పదని భావిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ముందంజలో నిలిచిన కర్నూలు , ప్రకాశం జిల్లాలో పునాదులు కదలిపోయే పరిస్థితులు రావడం , ఇతర ప్రాంతాల్లో కూడా సీనియర్లు పసుపు కండువాలు కప్పుకోవడానికి తయారుకావడం వైఎస్సార్సీపీ వ్యూహకర్తలను సతమతం చేస్తోంది.
అయితే జగన్ మాత్రం ప్రస్తుతానికి ఆచితూచి వ్యవహరించాలన్న ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తోంది. సీమలో నేతలు పార్టీలు మారినా దాని ప్రభావం పార్టీ శ్రేణులపై పడదని అంచనా వేస్తున్నారు. అయితే నడిపించే వాడు లేకుండా వైఎస్సార్సీపీ లాంటి పార్టీ ఉనికి కాపాడుకోవడం కష్టమే. అందుకే టీడీపీ అసంతృప్తులకు గాలం వేసే అవకాశం ఉంది. ఇటీవల నెల్లూరులో ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరగానే..వారిలో మరో కీలక సోదరుడిని తన వైపు తిప్పుకోవడం ద్వారా జగన్ నెల్లూరులో తన సత్తా చాటారు. అదేరీతిలో ఇప్పుడు జమ్మలమడుగులో రామ సుబ్బారెడ్డిని, ఆళ్లగడ్డలో గంగలు ఫ్యామిలీని, నంధ్యాల శిల్పా బ్రదర్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే అధికారాన్ని వీడి వాళ్లు వస్తారా లేదా అన్నది పక్కన పెడితే పోగొట్టుకున్న చోటే వెదుక్కునే రీతిలో వారికి కూడా అవసరం ఉన్నందున జగన్ కి కలిసొచ్చే ఛాన్స్ ఉంది. వీలయినంత త్వరలో ఆ ప్రయత్నం ఫలిస్తే కొంత ఉపశమనం దక్కుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ వ్యూహం ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తిదాయకే. అందుకే సీమలో పరిస్థితులు ఇప్పుడు వేడి వేడిగా మారుతున్నాయి. కడప, కర్నూలులో కాకపుడుతోంది. సుదీర్ఘకాలంగా ప్రత్యర్థులుగా ఉన్న రెండు వర్గాలను ఒకే ఒరలో ఇమడ్చాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే..తనను కాదని పోయిన వాళ్లకు గట్టిపాఠం చెప్పడానికి జగన్ ఎత్తులు వేస్తున్నారు. దాంతో రాబోయే కొద్దిరోజుల్లో ఎలాంటి పరిణామాలు జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.