కాంగ్రెస్ పార్టీ అవినీతిని భరించలేకే జనాలు భారతీయ జనతా పార్టీని ఎన్నుకొన్నారు. మోడీ ఆధ్వర్యంలో నీతిమంతమైన పాలన అందుతుందని దేశ జనులు ఆశించారు.
అయితే పాలనలో ఏడాదిని అయినా పూర్తి చేసుకొందో లేదో అప్పుడు మోడీ సర్కారుకు అవినీతి మరకలు పడ్డాయి. అవి క్రమంగా పెరిగి పెద్దవి అవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. రోజుకొక అడుగు లోతు అవినీతి కూపంలో కూరుకుపోతోంది భారతీయ జనతా పార్టీ.
సుష్మా స్వరాజ్, స్మృతీ ఇరానీ.. వంటి నేతలపై మరకలు పడ్డాయి. మోడీ క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్న వీళ్లు విమర్శలను ఎదుర్కొంటున్నారు. వీళ్లు రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలోనే వసుంధరరాజే వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెది అయితే పెద్ద చరిత్రలాగానే అగుపిస్తోంది. ఐపీఎల్ మాజీ బాస్ వివాదాస్పద లలిత్ మోడీ వ్యవహారంలో రాజే పేరు మార్మోగుతోంది. ఆయన అక్రమ సంపాదన రాజే కుటుంబానికి సంబంధించిన వ్యాపారాల్లో పెట్టుబడులుగా వచ్చిందనేది ఆరోపణ. ఒక దశలో లలిత్ మోడీకి పద్మశ్రీ ఇప్పించాలని కూడా రాజే సిఫార్సు చేశారంటే.. వీరి బంధం ఎంత గట్టిదో అర్థం అవుతోంది అందరికీ!
ఇక మధ్య ప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణం దుమ్మురేపుతోంది. ఇది కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే. ఈ కుంభకోణానికి సంబంధించి హత్యాకాండ కొనసాగుతోంది. ఆ కుంభకోణంతో సంబంధం ఉన్న వాళ్లు ఏకంగా హత్యలకే గురవుతుండటం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో కూడా బీజేపీపై తీవ్ర విమర్శలే వస్తున్నాయి. మరి ఈ కూపం నుంచి కమలం పార్టీ ఎలా బయటపడుతుందో చూడాలి!