జగన్ జనాల్లోకి రావాలంటున్న వైసీపీ కేడర్, కీలక నిర్ణయాలు.. జనాన్ని ఆకట్టుకునే కార్యక్రమాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. మరోవైపు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం.. ప్రస్తుతానికి సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.
అనుకోని చేసినా.. అనుకోకుండా చేసినా.. జగన్ సైలైన్స్ మాత్రం.. రాజకీయాల్లో కొత్త చర్చకు అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా.. జగన్ తీరు వైసీపీ కేడర్ లో అయోమయాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అధినేత జనంలోకి రాకుంటే తమకు రాజకీయ భవిష్యత్ ఎలా అన్న ప్రశ్న వైసీపీ నాయకులను వెంటాడే చాన్స్ ఉంటుందని విశ్లేషిస్తున్నారు.
అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్షానికి మధ్య కొన్ని విషయాల్లో ఎక్కువ తక్కువలు మంచిది కాదని ఎవరైనా అంగీకరిస్తారు. అలాంటి వాటిలో.. నేతలు జనాల్లోకి వెళ్లే విషయం కూడా చాలా ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ మ్యాటర్ లో.. జగన్ కంటే చంద్రబాబు ఓ అడుగు ముందే ఉన్నారన్న విషయాన్ని ఏపీలో ఎవర్ని అడిగినా అవుననే అంటారు.
ప్రభుత్వ కార్యక్రమాలపేరుతోనో.. రాజధాని శంకుస్థాపనతోనో.. మరే కారణంతో అయినా.. ఆయన ఎప్పుడూ పేపర్లలో హెడ్ లైన్స్ లో కనిపించేలా జాగ్రత్త పడుతున్నారు. మరి సొంత మీడియా ఉన్నా కూడా.. జగన్ గురించి పెద్దగా పేపర్లలో వచ్చే స్టోరీలు కూడా కనిపించడం లేదు. ఇదే.. వైసీపీ కేడర్ ను నిరాశకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.
అసలు జగన్ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? మరో మూడున్నరేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పటివరకు జనాల్లో పార్టీ పుంజుకోకపోతే.. కేడర్ పరిస్థితి ఏంటి? గత ఎన్నికల్లో 5 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే అధికారం కోల్పోయామని జగన్ ప్రచారం చెబుతూ ఉండొచ్చు. కానీ.. అది జనానికి, నాయకులకు ఎంత వరకు అర్థం అవుతుంది? ప్రస్తుతం జనాన్ని తన వైపు తిప్పుకొనేందుకు అసలు జగన్ ఏం చేస్తున్నారు? ఏడాదిన్నర బాబు పాలనపై ఎంతో కొంత.. ఎక్కడో అక్కడ ప్రజల్లో అసంతృప్తి ఉండే ఉంటుంది.
దాన్ని పొలిటికల్ గా ఎలా క్యాష్ చేసుకుంటున్నారు? ఇలాంటి విషయాలేవీ అర్థం కాక.. వైసీపీ కేడర్ మాత్రం జగన్ లాగే సైలెన్స్ కంటిన్యూ చేస్తోంది. కేడర్ కు లీడర్ షిప్ కు ఉన్న ఈ గ్యాప్ ఫుల్ ఫిల్ కావాలంటే.. ముందు జగన్ కనీసం పార్టీ విస్తృత స్థాయి సమావేశమైనా నిర్వహించాల్సిన అవసరం ఉందని.. నిపుణులు సూచిస్తున్నారు.