చంద్రబాబు మంగళగిరిలో మహా సంకల్పం వేదికగా టిఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై నిప్పులు చెరిగారు. ఈ సంభాషణ చంద్రబాబు మాటల్లోనే…. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారు. నాది ఒక ప్రభుత్వం, నీది ఒక ప్రభుత్వం, నాకు ఏసిబి ఉంది, నీకు ఏసిబి ఉంది, నాకు పోలీసులు ఉన్నారు, నీకు పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు జాగ్రత్త.
అంతే కాదు మా ఎమ్మెల్యేని ఎలక్షన్ కు ముందు మీ ఫాం హౌస్ లో డబ్బులిచ్చి పోలీస్ సెక్యూరిటీతో పంపావు, అప్పుడు నీకు సిగ్గులేదా అని రెచ్చిపోయారు.
ఉమ్మడి రాజధాని గవర్నర్ చేతిలో ఉంది. నీ ఒక్కరి సొత్తు కాదు హైదరాబాద్. నాకు ఎమ్మెల్సీ ముఖ్యం కాదు సిద్దాంతాలు, నీతి ముఖ్యం. తెలంగాణలో పత్రికా స్వేచ్చను తొక్కేశారు. ఆంద్రా వాళ్ళ ఇళ్ళను కూల్చడానికి పోయాడు ఈ పెద్ద మనిషి. నేను ఎవ్వరికి భయపడను. నా ప్రజలను నా ప్రాణాలు అడ్డు పెట్టి అయినా కాపాడుకుంటాను. ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని స్టింగ్ ఆపరేషన్ చేశారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మా ఏసిబి కూడా అక్కడే ఉందని గ్రహించాలి. హైదరాబాద్‌లో మీకెంత హక్కుందో మాకూ అంతే హక్కుంది. ఇప్పుడు నేనొక వ్యక్తిని కాను, ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇంకా చాలానే ఉన్నాయి తమ్ముడు మనం భయపడం ఎవరెన్ని కుట్రలు చేసినా అని సభా వేదికగా రెచ్చిపోయారు.
ఇంకా ఆయన మాటల్లోనే… నేనేమైనా తెలంగాణలో కేసిఆర్ బానిసనా! దేనికీ భయపడను. హైదరాబాద్ లో ఆంద్రా వాళ్ళను తిడుతున్నారు. వీళ్ళ దయా దాక్షిణ్యాలపై నేను బ్రతకలేదు. ఇక్కడ మనకు ఒక నాయకుడు ఉన్నాడు 16 కేసులు పెట్టుకుని, కోర్టుల చుట్టూ తిరుగుతూ నన్ను సమాధానం చెప్పమని అడుగుతున్నాడు. నాపై ఆరోపణలు చేయడానికి నీకు సిగ్గు లేదా అని జగన్ ను విమర్శించారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్నిహెచ్చరిస్తున్నా దయచేసి రాష్ట్రాల మద్య తగాదా వద్దు. నీకు ఎన్ని అధికారాలున్నాయో అంతకంటే ఎక్కువ అధికారాలు నాకూ ఉన్నాయి అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. నా ఫోన్ ట్యాప్ చేశారు. ఎప్పుడో ఎక్కడో మాట్లాడింది తెచ్చిపెట్టి ఇప్పుడు కుట్ర చేస్తున్నారు. నేను తప్పు చేయను. ఫోన్ ట్యాప్ చేసిన ప్రభుత్వాలు కూలిపోయాయి. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి అంటూ మహా సంకల్పాన్ని వేదికగా చేసుకొని కేసిఆర్ పై నిప్పులు చెరిగారు.
ఈ మాటలని టిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా తిప్పుకొడుతుందో చూడాలి.