తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి ప్రత్యేక సర్వే చేయించుకొన్నారట. తను ముఖ్యమంత్రిగా ఎన్నికై ఏడాది పూర్తి అయిన నేపథ్యంలో ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో..
జనాల నాడిని పట్టే ప్రయత్నం చేశారట. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశం గురించి కూడా ఆయన ఈ సర్వేలో తేల్చే ప్రయత్నం చేశారట! మరి ఇందులో తేలినది ఏమిటంటే… ఇప్పటికిప్పుడు ఎన్నికలంటూ వస్తే తమ పార్టీ ఏపీలో పూర్తిగా స్వీప్ చేస్తుందని బాబుకు అర్థం అయ్యందట!
ఇంకా డీటెయిల్డుగా చెప్పాలంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే.. ప్రధాన ప్రతిపక్షం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కేది కేవలం 30 ఎమ్మెల్యే సీట్లేనట! అంటే రాష్ట్రంలో ఉన్న 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ 145 సీట్లను సొంతం చేసుకొంటుందనమాట! మరి మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 60 కి పైగా అసెంబ్లీ సీట్లను సొంతం చేసుకొంది. అయితే బాబు ప్రస్తుత లెక్కల ప్రకారం మాత్రం.. వైకాపాకు ఆ మాత్రం సీట్లుకూడా రావు! జస్ట్ ముప్పై మాత్రం వస్తాయని తెలుగుదేశం అధినేత చేయించుకొన్న అంతర్గత సర్వేల్లో తేలిందట!
మరి వినడానికి కొంత విడ్డూరంగా ఉంది. ప్రతిపక్ష పార్టీ గతంతో పోలిస్తే చాలా బలహీన పడిందని అధికార పార్టీ సర్వే లో తేలింది. అయినా అధికారంలో ఉన్నవారు ఇలాంటి సర్వేలు చేయించుకోవడం.. తాము బలంగా ఉన్నామని అంటూ లీకులు ఇచ్చుకోవడం కొత్తేమీ కాదు. తమ పాలనలో అంతా బాగుందనే అధికార పార్టీ వారు చెప్పుకొంటూ ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం అధినేత కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అసలుతీర్పును ఇవ్వాల్సింది మాత్రం ప్రజలు కదా!