9 సంవత్సరాల జగన్ కృషి ఫలించింది. ఇటీ వల జరిగిన ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఉదయం 8.39 గంటలకు సచివాలయంలోని తన చాంబర్లో అడుగుపెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జగన్ సచివాలయంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.
సీఎం హోదాలో తొలిసారి ఆయన సచివాలయంలోకి ప్రవేశించగా, ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్ కు ఘనస్వాగతం పలికారు. వేదపండితులు వేదాశీర్వచననం నిర్వహించగా.. సీఎం జగన్ సుముహూర్తంలో ఛాంబర్‌లో అడుగుపెట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆయన తన చాంబర్‌లోని సీఎం కుర్చీలో ఆశీర్వచనం పొందారు.తండ్రి వైఎస్ఆర్ చిత్రపటం చూసి భావోద్వేగానికి లోనయ్యారు.

ఆయన మూడు ఫైళ్లపై సంతకం చేశారు. కాగా ఆశావర్కర్ల వేతనం నెలకు రూ.10 వేలు చొప్పున పెంపు ఫైలు పై సీఎం జగన్ తొలి సంతకం చేయడం విశేషం.అనంతరం ఎక్స్‌ప్రెస్ హైవేకి కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ రెండో సంతకం చేశారు. జర్నలిస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యువల్ ఫైల్‌పై మూడో సంతకం చేశారు. సచివాలయం ఉద్యోగులు సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాంతో పాటు చీఫ్ సెక్రరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతం సవాంగ్, పలు శాఖల అధికారులు, వేదపండితులు పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నందిగం సురేశ్, ఆదిమూలపు సురేశ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, గుమ్మనూరు ఈ కార్యక్రమంలో జయరాం పాల్గొన్నారు.
అనంతరం సీఎం జగన్ అన్ని శాఖల కార్యదర్శులతో తొలిసమావేశం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఉదయం 10.50 గంటలకు సీఎం జగన్ ఉద్యోగులను కలిసి వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 11:15 గంటలకు జరగనున్న ప్రొటెం స్పీకర్ శంబంగి చినఅప్పలనాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా జగన్ హాజరుకానున్నారు.

