అయిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికల గురించి తమ్ముళ్లుగోలపెడుతున్నారు. పైకి వినిపించనీయడం లేదు కానీ..
వాళ్లు తమ ఆవేదనను మీడియా మిత్రుల ముందు వెల్లబోసుకొంటున్నారు. తమకు ఎమ్మెల్సీ పదవులు దక్కలేదన్న ఆవేదనతో ఉన్న వారు ఆ పదవులను అమ్మివేయడం జరిగిందనే సంచలన ఆరోపణ కూడా చేస్తున్నారు. డబ్బుండి కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం లోకి ఎంటరైన వాళ్లు ఆ సీట్లను కొనుక్కొన్నారని వారు చెబుతుండటం విశేషం. ఏకగ్రీవంగా పూర్తైన శాసనమండలి ఎన్నికల్లో మూడు సీట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాలో పడగా.. ప్రతిపక్ష వైకాపా కు రెండు సీట్లు దక్కాయి.
విశేషం ఏమిటంటే.. ఎక్కడైన ప్రతిపక్ష పార్టీలో పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉంటుంది. ఎమ్మెల్సీ, రాజ్యసభ వంటి సీట్ల విషయంలో ప్రతిపక్ష పార్టీల్లో తన్నులాటలు జరుగుతూ ఉంటాయి. అయితే వైకాపాలో రెండు సీట్లలో ఇద్దరు సెట్ అయిపోగా.. తెలుగుదేశంలో మాత్రం ఆశావహుల జాబితా చాంతాడంత కనిపించింది. చాలా సిఫార్సులు జరిగాయి.. లాబీయింగ్ కు కూడా తెరలేచింది. అయితే తను అనుకొన్న ముగ్గురికీ బాబు పదవులను అప్పజెప్పాడు. మరి పదవులు దక్కిన వారు పసుపు పార్టీలో పుట్టిన వారేమీ కాదు! కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన వారు. సాధారణంగా నామినేటెడ్ పోస్టులను పార్టీకి విశిష్ట సేవ చేసిన వారికే కట్టబెడతారెవరైనా. కాంగ్రెస్ పార్టీ లో అధిష్టానంపై విధేయతను చూపే వారికి నామినెట్ పోస్టులు దక్కుతుండటాన్ని గమనిస్తూనే ఉంటాం.
అయితే తెలుగుదేశంలో బాబు నాయకత్వం మీద అమితమైన విశ్వాసం కనబరిచే వారికి… ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి మీద పడి రక్కడానికి రెడీగా ఉన్నట్టుగా కనిపించే వారికి పదవులు దక్కలేదు. అసలు వారు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియని వారికే పదవులు దక్కాయి. దీని మర్మమేంటబ్బా.. అంటే, డబ్బు అంటున్నారు తమ్ముళ్లు. పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో కొంతమంది ఎమ్మెల్సీ పదవుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించడానికి కూడా వెనుకాడలేదని తెలుస్తోంది. అలా సూట్ కేసులను ఎదురేసిన వారికే ఎమ్మెల్సీ పదవులు లభించాయని ఎన్టీఆర్ ట్రస్టుభవన్ లోని అసంతృప్త నేతలు చెబుతున్నారు.
ఈ పోటీలో తాము వెనుకబడ్డామని… ప్రెస్ మీట్లు పెట్టి జగన్ పై దుమ్మెత్తిపోసినా ప్రయోజనం దక్కలేదని.. దశాబ్దాల నుంచి పనిచేసిన తమకు కాకుండా నిన్నలా మొన్న పార్టీలోకి వచ్చిన వారికి పదవులు దక్కయని వారు వాపోతున్నారు. పచ్చనోట్లు పెట్టగలిగిన వారికే పదవులు దక్కాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇన్ని రోజులూ రాంగ్ రూటులో పనిచేశామని తమ మీద తామే జాలి చూపించుకొంటున్నారు. మరి ఇప్పుడు పార్టీలో పదవులు పొందడానికి రైటు రూటేదో తెలిసింది కదా.. ఇలా దూసుకుపోతే సరిపోదా!