తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పటి వరకూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఈ రూట్లో పయనించగా.. మరి కొందరు ఇదే బాటలో నడవనున్నారని తెలుస్తోంది. తాజాగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆళ్లగడ్డలో టీడీపీలో కీలక నేతలుగా ఉన్న ఇరిగెల రాంపుల్లారెడ్డి, ఇరిగెల ప్రతాప్‌రెడ్డి సోదరులు… ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

గత కొంత కాలంగా మంత్రి అఖిలమీద ఈ నేతలంతా గుర్రుగా ఉన్నారు. అఖిల వ్యవహారం నచ్చకనే వీరంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.భూమా అఖిల ప్రియ అవినీతికి పాల్పడుతున్నారంటూ గతేడాది డిసెంబర్ 28న టీడీపీ సభ్యత్వాలకు ఇరిగెల సోదరులు రాజీనామా సమర్పించారు. శిల్పా సోదరులు… దగ్గరుండి ఇరిగెల సోదరులను వైఎస్ జగన్ దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జగన్.. పార్టీ కండువా కప్పి వీరిద్దరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

వీరిద్దరూ ఈరోజు వైసీపీలో చేరే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే వీరికి జగన్ ఏం హామీ ఇస్తారన్న విషయమై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేత గంగుల ప్రతాప్ రెడ్డికి మద్దతు ఇవ్వాల్సిందిగా జగన్ వీరికి సూచించనున్నట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ ప్రత్యర్థి వర్గాలు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఆమెకు పెద్ద సవాల్ విసిరే అవకాశం ఉంది.