టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం నార్కట్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. హరికృష్ణ మరణంతో ఆయన కుటుంబంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విషాదం నెలకొంది. ఆయన ప్రమాదం మరో నలుగురి యువకుల జీవితాన్ని ప్రశ్నార్థకం చేసింది.
అన్నేపర్తి వద్ద హరికృష్ణ కారు డివైడర్ ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఫొటోగ్రాఫర్లు శివ, భార్గవ్, ప్రవీణ్ లు గాయపడ్డారు.ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణతో పాటు ఈ ముగ్గురిని కూడా నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించి వైద్యసదుపాయం కల్పించారు.
అయితే ఆతర్వాత వారిని పట్టించుకోక పోవడంతో మా పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో తాము ప్రయాణిస్తున్న కారు, కెమెరాలు, ఇతర సామాగ్రి ధ్వంసమయ్యాయని, అప్పు చేసి కెమెరాలు కొనుగోలు చేశామని, ఆ వృత్తే తమ జీవనాధారమని బాధితులు చెప్పారు.
అవే మా కుటుంబాలకు జీవనాధారం. రేపటి నుంచి ఎలా బతకాలి. గాయాల నుంచి కోలుకుని తిరిగి పనిలో చేరేంత వరకు మమ్మల్ని ఎవరు పోషిస్తారు. మాకు ఎవరు న్యాయం చేస్తారంటూ’ ప్రవీణ్, శివ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలని ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి వారు విఙ్ఞప్తి చేస్తున్నారు.