తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ నెల 26న హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో ఈ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నిర్ణయించారు. దీనిపై సచివాలయంలో జరిగిన సమావేశంలో కెసిఆర్ ఈ తేదిని ఖరారు చేశారు.
ఈ నెల 17 వ తేది నుంచి 22 వరకూ గ్రేటర్ హైదరాబాద్ లో వంద చోట్ల, మరో 95 నియోజకవర్గాల్లోనూ పేద ముస్లీములకు బట్టలు పంచిపెట్టాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విందు ఇవ్వాలని, హైదరాబాద్ లో జరిగే విందుకు స్వయంగా తానే హాజరవుతానని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీకి చెందిన వారితో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ముస్లీం మతపెద్దలు, వివిధ దేశాల రాయబారులు, కాన్సులేట్లను కూడా విందుకు ఆహ్వానించాలని కెసిఆర్ అధికారులను సూచించారు.
రంజాన్ మాసంలో మదర్సాలు, అనాథాశ్రమాల్లో కూడా బట్టలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ప్రార్ధనా స్ధలాల వద్ద కనీస వసతుల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.