తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేస్తున్న జల దీక్ష రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటోంది. మంగళవారం నాడు కర్నూలులో చేపట్టిన ఈ దీక్ష అటు తెలంగాణ ప్రభుత్వాన్ని, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఓ ఊపు ఊపుతోంది.
ఒకవైపు దీక్ష జరుగుతుంటే మరోవైపు చర్చలకు రావాలంటూ తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమను చర్చలకు ఆహ్వానించారు. ఎపి మంత్రికి ఫోన్ చేసిన హరీష్ రావు ఆర్డీఎస్ పనులను ఆపాలంటూ రాయచూర్ కలెక్టర్ కు రాసిన లేఖను ఉపసంహరించుకోవాలంటూ హరీష్ రావు కోరారు. అలా చేయకపోతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు భవిష్యత్తులో ఎలాంటి సహకారం ఉండదని హెచ్చరించారు.
అయితే హరీష్ రావు ఫోన్ పై ఎపి మంత్రి దేవినేని సరిగా స్పందించలేదు. రెండు రోజుల తర్వాత చూద్దామంటూ ఫోన్ కట్ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.ఇ.క్రష్ణమూర్తి మాట్లాడుతూ హరీష్ రావు తన నోటి దురుసు తగ్గించుకోవాలని హితవు పలికారు. అక్రమ ప్రాజెక్టులపై కేంద్ర జల వనరుల సంఘానికి లేఖ రాసామని, వారిచ్చే సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని కెఇ అన్నారు. నోరు ఉందని కదా అని హరీష్ రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని ఆయన అన్నారు.