చాలా మంది ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని చూసి జాలిపడుతున్నారు. అసలు ఏపీలో ఉనికిలో ఉందో లేదో.. ఎవరికీ అర్థం కాని కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆయన బాగా కష్టపడుతున్నాడని…అసలు కాంగ్రెస్ మళ్లీ కోలుకొనే అవకాశాలు లేని నేపథ్యంలో
ఆయన ఇంతగా తాపత్రయపడడం ఎందుకో.. అని కొంతమంది ధీర్ఘాలు తీస్తున్నారు. అయితే ఇలా కష్టపడటం వెనుక రఘువీరారెడ్డి స్కెచ్ వేరే ఉంది! అదేమిటంటే… ఎలాగైనా రాజ్యసభ సీటును సొంతం చేసుకోవడం.
ఏపీ నుంచి కాదు.. కర్ణాటక కోటా నుంచి రాజ్యసభ ఎంపీ సీటును సొంతం చేసుకోవాలని రఘువీరారెడ్డి ప్రయత్నిస్తున్నాడు. అందుకోసమే ఇప్పుడు ఆయన ఏపీ కాంగ్రెస్ తరపున ఇంతగా కష్టపడుతున్నాడని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఆ తర్వాత అనేక మంది కాంగ్రెస్ ను వీడిన వారే కానీ… తిరిగి కాంగ్రెస్ బలోపేతం అవుతుందనే పరిస్థితులు ఏమీ కనపడటం లేదు. ఇలాంటి నేపథ్యంలో కూడా రఘువీరారెడ్డి కష్టపడుతున్నాడు. ఇంకో విషయం ఏమిటంటే కాంగ్రెస్ తరపున ఏపీలో నిర్వహించబడుతున్న కార్యక్రమాలన్నింటికీ రఘువీరారెడ్డే ఖర్చు పెట్టుకొంటున్నాడట!
మరి రాజ్యసభ సీటు కోసమే ఆయన ఈ విధంగా ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం కరుణిస్తుందనే ఆశాభావంతోనే ఉన్నాడాయన. మరి ఇంత ఖర్చు చేస్తున్న రఘువీరకు ఎంతటి ప్రతిఫలం దక్కుతుందో చూడాలి!