ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో నిర్వహించిన బంద్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక డిమాండ్ ను ప్రముఖంగా వినిపించాడు. ఒకే డిమాండ్ ను ఆయన పలుమార్లుగా రిపీట్ చేశాడు.
తమ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతం అయిన నేపథ్యంలో జగన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశం గురించి తెలుగుదేశం పార్టీ కూడా పోరాడాలని ఆకాంక్షించాడు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని టీడీపీ ఎండగట్టాలని జగన్ అన్నాడు.
రాష్ట్ర విభజన సమయంలో జరిగిన పరిణామాలను జగన్ గుర్తు చేశాడు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీని ఇచ్చిందని గుర్తు చేశాడు. కేంద్రంలో అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాటు ప్రత్యేకహోదా అని అంటే.. భారతీయ జనతా పార్టీ ఏకంగా పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా దక్కాలన్న డిమాండ్ ను వినిపించిన సంగతిని జగన్ గుర్తు చేశాడు. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ హామీని నిలబెట్టుకోవాలని జగన్ డిమాండ్ చేశాడు. ఇక విభజనకు మద్దతునిచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ అంశం గురించి ఎందుకు స్పందించడం లేదు? అని జగన్ అన్నాడు.
భారతీయ జనతా పార్టీ వాళ్లు ఏపీకి అన్యాయం చేస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు రావాలని.. తమ పార్టీ ఎంపీల చేత కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయించలని జగన్ డిమాండ్ చేశాడు. అలా చేస్తే భారతీయ జనతా పార్టీకి అంశం తీవ్రత అర్థం అవుతుందని.. అలా చేస్తే కేంద్రంలో కదలిక వస్తుందని జగన్ అభిప్రాయపడ్డాడు.మ రి జగన్ డిమాండ్ బాగానే ఉంది కానీ.. టీడీపీ అందుకు సమ్మతిస్తుందా?