కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్య మీద అనుమానంతో తన పగను పిల్లలమీద తీర్చుకున్నాడు కషాయి తండ్రి. కట్టుకున్న భార్య వదిలి వెళ్లడంతో.. మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఇద్దరు పిల్లలను దారుణంగా హతమార్చాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు.
ఈ ఘటన కర్నూలు జిల్లా జూపాడు బంగ్లాలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన ధనోజీరావుకి ఝాన్సీ లక్ష్మీబాయితో పదేళ్ల కిందట పెళ్లయ్యింది. వీరికి లిఖిత (7), మధు (4) అనే ఇద్దరు పిల్లలున్నారు. గత కొంత కాలంగా భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఝాన్సీ భర్త, పిల్లలను వదిలేసి వెళ్లిపోయింది. భార్య తనను వదిలి వెళ్లడంతో మనస్థాపానికి గురైన ధనోజీరావు సోమవారం తెల్లవారుజామున కుమార్తెను గొంతుకోసి హతమార్చాడు. తర్వాత కుమారుణ్ని నీటి తొట్టిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చాడు.
అనంతరం తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కానీ తాడు తెగిపోవడంతో కింద పడిపోయాడు. తర్వాత ఆత్మహత్య యత్నం మానుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.