క్రమశిక్షణకి ఆయన మారు పేరు. ముక్కు సూటి తనానికి ఆయన ట్రేడ్ మార్క్. ఆయనే కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. చాలా రోజులుగా యాక్టివ్ పాలిటిక్స్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, ఇప్పుడు తను క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానంటూ సంచనల ప్రకటన చేశారు. అయితే, తాను ఏ పార్టీలో చేరేదీ తాను త్వరలోనే నిర్ణయించి ప్రకటిస్తానని ఆయన తాజాగా మీడియాతో చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కూడా తనకు బంధువులే అని మోహన్‌బాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల అవినీతినీ… కొంతమంది అధికారుల లంచగొండి తనాన్ని తాను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్తున్నారు.నిజానికి మోహన్‌బాబు ప్రస్తుతం రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలతో మంచి అనుబంధమే ఉందని చెప్పాలి.
తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావుతో మోహన్‌బాబు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ మరణానంతం చంద్రబాబునాయుడితో కూడా బాగానే ఉంటూ వస్తున్నారు. అలాగే, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి బంధువులతోనే ఆయన వియ్యమొందారు. కాబట్టి, తాను ఏ పార్టీలో చేరతానూ అనేది త్వరలోనే ప్రకటిస్తాననడం ఆసక్తికరంగా మారుతోంది. మోహన్‌బాబు వైకాపాకి మద్దతు పలుకుతారా, అధికార దేశం పార్టీకి వెళ్తానంటా అనేది ప్రస్తుతానికి ఊహకందని ప్రశ్నగానే చెప్పుకోవాలి. ఏదేమైనా పెదరాయుడు క్రియాశీల రాజకీయాల్లోకి రావడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం కావొచ్చు!