కాపుల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం అరెస్ట్ ఎవరికి ప్లస్..? కొంతకాలంగా ప్రభుత్వ పెద్దలే ముద్రగడపై దుమ్మెత్తిపోయడం చూస్తుంటే.. ఆయన అరెస్ట్ తో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూల పరిస్థితులు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జగన్ కు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు జగన్ కు ఇది మరో అస్త్రం అవుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
కాపు రిజర్వేషన్ల కోసం దీక్షకు దిగిన ముద్రగడ అరెస్టు చేయడం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కడం చూస్తుంటే… ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జగన్ కూడా రంగంలోకి దిగుతారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపు వర్గం ప్రజలు పూర్తి మద్దతు ప్రకటించే అవకాశముంది. అది వచ్చే ఎన్నికల నాటికి జగన్ కు ప్లస్ కావొచ్చు.
నిజానికి తుని సంఘటనతోనే కాపుల పవర్ ప్రభుత్వానికి తెలిసివచ్చింది. అంతకు ముందు కాపు రిజర్వేషన్లను తేలికగా కొట్టిపారేసిన వారంతా తుని ఘటన తర్వాత….ఈ విషయంలో నోరుమెదపలేదు. చంద్రబాబు సర్కారు కూడా ఆ ఘటన తర్వాత కాపులను కలుపుకుపోతేనే భవిష్యత్ లో కాలం కలిసివస్తుందని భావించిన చంద్రబాబు.. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి… ఓ కమిటీ వేశారు. ఆగస్టులోగా ఆ పని పూర్తవుతుందని ప్రభుత్వం ప్రకటించినా… తుని ఘటనకు సంబంధించి వందలాది మందిని అరెస్ట్ చేయడంతో మళ్లీ కాపుల ఉద్యమం నివురుగప్పిన నిప్పులా రాజుకుంది.
గతంలో ఎలా ఉన్నా ప్రస్తుతం కాపు ఉద్యమం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే సాగుతోంది. ఇదే వైసీపీకి ప్లస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నారు. రాష్ట్ర మంత్రులే కాపు నాయకుడిపై విమర్శలు గుప్పిస్తూ… ముద్రగడ వైసీపీతో లాలూచీ పడ్డారని కామెంట్ చేయడం ఇటు వైసీపీ శ్రేణులను కాపు ఉద్యమంవైపు నడిపిస్తున్నాయి. ఇప్పటికే రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపిస్తున్న జగన్ కాపుల ఉద్యమాన్ని మరో అస్త్రంగా మార్చుకుని ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు ఛాన్స్ దొరికింది. ఒకవేళ ముద్రగడను ప్రభుత్వం బుజ్జగించినా… వైసీపీకి ప్రజా మద్దతు పెరుగుతుంది కానీ తగ్గదని రాజకీయ పండితులు చెబుతున్నారు.