మరి తను ఖాళీ గా ఉండి ఏం చేయాలని అనుకొంటున్నాడో.. లేక జగన్ రూటు బాగానే ఉందని భావిస్తున్నాడో కానీ..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బాబు కూడా ఓదార్పు యాత్రకు సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది. అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణలో ఈ యాత్ర ఉంటుందని సమాచారం. ప్రమాదాల్లో మరణించిన తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలను.. వేరే ప్రమాదాలతో బాధితులుగా మిగిలిన కుటుంబాలను లోకేష్ బాబు పరామర్శించనున్నాడని తెలుస్తోంది.
ఏప్రిల్ 12 వ తేదీ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఓదార్పు యాత్రకు ఇంకా పేరు పెట్టలేదు కానీ.. అనేక రకాల సంఘటనల్లో బాధితులుగా మిగిలిన కుటుంబాలును పరామర్శించి ఆయా కుటుంబాలకు పరిహారాన్ని.. మానవతా దృక్పథంతో ఆర్థిక సాయాన్ని చేయనున్నట్టుగా తెలుగుదేశంపార్టీ ప్రకటించింది.
మరి ఏపీ వరకూ ఓదార్పు అంటేనే.. జగన్ మోహన్ రెడ్డే గుర్తుకు వస్తాడు. వైఎస్ మరణం తో హతశయులై మరణించిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని ప్రకటించి జగన్ మోహన్ రెడ్డి కొత్త రాజకీయ ప్రస్థానానికి అడుగేశాడు. ఆ తర్వాత ఆ ఓదార్పు యాత్ర సీరియల్ లా సంవత్సరాల పాటు కొనసాగింది. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా ఓదార్పు కొనసాగింది.
ఇటీవల ఆ ఓదార్పుయాత్ర బాధ్యతను జగన్ చెల్లెలు షర్మిల తీసుకొంది. కేవలం వైఎస్ మరణంతో నమోదైన మరణాల విషయంలోనే కాదు.. జగన్, షర్మిల, విజయమ్మలు అనేక రకాల ఓదార్పు యాత్రలు చేశారు. ఈ తీరును తెలుగుదేశం వారు వెక్కిరించారు కూడా. అయితే ఇప్పుడు తీరా తెలుగుదేశం యువనేతే ఓదార్పు బాట పట్టాడు! మరి దీన్ని తమ్ముళ్లు ఎలా సమర్థించుకొంటారో!