తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఏడాది కొంత ఆశాజనకంగా మొదలవుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నిల్లో రెండు స్థానాల్లో సాధించిన విజయం.. అసలే ముఠా కుమ్ములాటలు, ఫిరాయింపులు, అనైక్యత ఇత్యాది జాడ్యాలతో కుళ్లిపోతున్న ఆ పార్టీకి కాస్త ఊపిరి పోసినట్లు అయింది.
రకరకాల పరిస్థితుల నేపథ్యంలో పార్టీ నాయకులు అనుసరిస్తున్న భిన్న ధోరణుల నేపథ్యంలో అసలు తమ పార్టీ తెలంగాణలో అయినా సజీవంగా ఉంటుందా? లేదా, ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా శల్యావశిష్టం అయిపోతుందా?అనుకుంటూ భయపడుతూ బతికిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త ఉత్సాహాన్ని అందించాయని చెప్పుకోవాలి. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తర్వాత.. ”తెలంగాణలో తమదే అధికారం ” అనుకుంటూ విర్రవీగిన కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత దారుణంగా చతికిలపడిందో అందరికీ తెలుసు.
ఏపీలో అసలు ఆ పార్టీ ఊసు లేకుండాపోగా, తెలంగాణలో కాస్త పరువు దక్కించుకుని ప్రతిపక్షంగా కూర్చుంది.అయితే అప్పటినుంచి వరుసగా కష్టాలనే అనుభవిస్తూ ప్రస్థానం సాగిస్తోంది. ప్రధానంగా ఆ పార్టీలో నాయకుల మధ్య అనైక్యత. పార్టీ ప్రయోజనాల గురించి ఎవ్వరికీ పెద్దగా శ్రద్ధ లేకపోవడం… వారి దినదిన పతనానికి బాటలు వేస్తూ వచ్చాయి.
దారితప్పిన వ్యూహాలు, ప్రభుత్వ వ్యతిరేకతను క్రియాశీలంగా కాకుండా.. పనిగట్టుకుని ప్రదర్శిస్తూ ప్రజల దృష్టిలో పలుచన అయిపోవడం.. లాంటివి వారిని దెబ్బతీశాయి. అధిష్ఠానం కూడా తెలంగాణపార్టీని గాలికి వదిలేసిందనే అనుకోవాలి. తెరాస సాగిస్తున్న పాలన ప్రభావాన్ని గమనించి.. ఇక మళ్లీ అధికారంలోకి వచ్చే స్థాయిలో తాము పుంజుకోవడం అసాధ్యం అని భావించిన అనేక మంది నాయకులు ఆ పార్టీలోకే వెళ్లిపోయారు.
మొత్తానికి సగం కాంగ్రెసు పార్టీ ఖాళీ అయిపోయినట్లే లెక్క. ఇంకా వలసలు పోదలచుకుంటున్న వారే కనిపిస్తున్నారు.ఇలాంటి సమయంలో రెండు జిల్లాల్లో కాస్త బలం కనబరచి, ఎమ్మెల్సీలను గెలుచుకోవడం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు మీద మనుగడ మీద కొంత ఆశ కల్పిస్తున్నదని చెప్పుకోవచ్చు.
మరీ అధికారంలోకి వచ్చేంత సీన్ తమకున్నదని వారు కూడా నమ్మడం లేదు గానీ.. కనీసం దుకాన్ బంద్ చేయకుండా.. కొనసాగగలమనే విశ్వాసాన్ని ఈ రిజల్టుతో తెచ్చుకోలిగారు.