తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీల మధ్య బంధం క్షీణదశలో ఉందని చెప్పడానికి దీన్నో ఉదాహరణగా తీసుకోవచ్చు! భాజపాతో చంద్రబాబు కలిసి ఉండాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకి ఉంటుందని తెలుస్తూనే ఉంది. కానీ, ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆ అభిప్రాయం ఉండాలి కదా! పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకి కూడా అలాంటి అభిమానం ఉండాలి కదా!
ఆ గ్యాప్ ఇప్పుడు స్పష్టంగానే కనిపిస్తోంది. భాజపాతో మంచిగా ఉంటూనే రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకోవాలన్నది ఏపీ సర్కారు వ్యూహం. అయితే, అందుకు భిన్నమైన సంకేతాలు కేంద్రం నుంచి వెలువడుతూనే ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయంలో పలువురు కేంద్రమంత్రులు తెగేసి చెప్పినా అర్థం కానట్టుగానే ప్రవర్తిస్తోంది దేశం! తాజాగా స్మార్ట్ సిటీల విషయంలో జరిగింది కూడా అదే.
దేశవ్యాప్తంగా 13 నగరాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో ఎంపికైన రాష్ట్రాలు పోటీ పడాలని ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వెంకయ్య పిలుపునిచ్చారు. ప్రకటించిన నగరాలను అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రులు సహాయపడుతూ అందరూ ఎదగాలని కాంక్షించారు. అయితే, ప్రస్తుతానికి ప్రకటించిన ఈ ఆకర్షణీయ నగరాల జాబితాలో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కు అవకాశం దక్కింది. అనూహ్యంగా ఏపీ నుంచి ఏ పేరూ వినిపించలేదు! స్మార్ట్ సిటీల జాబితాలో ఏపీకి ప్రాధాన్యత లేదన్న అర్థమైంది!!
వరంగల్‌కి అవకాశం ఇచ్చి, అదే సమయంలో ఏపీ నుంచి ఏ పట్టణాన్నీ ఎంపిక చేయకపోవడం కాస్త ప్రత్యేకంగానే కనిపిస్తోంది. ఈ చర్య ద్వారా చంద్రబాబుకు కేంద్రం ఏవో కొన్ని సంకేతాలు ఇచ్చి ఉంటుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. పొత్తులో ఉన్న ఏపీకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా… పక్క రాష్ట్రం తెలంగాణకు కేంద్రంలోని భాజపా ప్రాధాన్యత పెంచుతోందా..? ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బలహీనపడుతున్న ఈ సందర్భంలో స్మార్ట్‌సిటీల జాబితాలో ఏపీకి స్థానం లేదంటే… ఇలాంటి అనుమానాలే ఎవరికైనా కలుగుతాయి. ఏదేమైనా, కేంద్రంలోని పెద్దలు ఏపీ విషయంలో ఎలా స్పందిస్తున్నారు అనడానికి ఇదో ఉదాహరణగా చెప్పుకోచ్చు.