ఇంటర్ ఫెయిల్ కానీ సివిల్స్‌లో ర్యాంక్ సాధించి సత్తా చాటాడు తెలుగు విద్యార్థి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన పామూరి సురేష్ పదో తరగతి వరకు సాధారణ విద్యార్థి.. ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయ్యాడు.
దీంతో ఎందుకు పనికి రాడని అందరూ అనుకున్నారు. కానీ సురేష్ మాత్రం తిరిగి నంద్యాలలో డిప్లొమా కోర్సులో చేరి, తర్వాత ఈసెట్ రాసి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకు సాధించాడు. కర్నూలులో ఇంజినీరింగ్ పూర్తి చేశాక.. 2011లో జెన్‌కోలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు.. కానీ సివిల్స్ సర్వీసెస్ రాయాలని, సత్తా చాటాలని అనుకున్నాడు.
2017లో తొలిసారి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయగా ప్రిలిమ్స్ పరీక్షలో కూడా ర్యాంక్ సాదించలేకపోయాడు. రెండో ప్రయత్నంలో ఏకంగా ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది జాబితాలో మాత్రం చోటు దక్కలేదు.
దీనికి తోడు కొవిడ్ బారిన పడి వినికిడి సమస్య తలెత్తింది, అయినా పట్టు వదలలేదు .. సివిల్స్‌కు ఇబ్బందిగా ఉందని 2020లో నెలకు రూ.1.50 లక్షల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పట్టువదలకుండా ప్రయత్నిస్తూ 2024లో ఏడో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్స్‌లో 988వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు.