ఆంధ్రప్రదేశ్ డ్యాష్ పనితీరు ఊహించని దాని కంటే ఎక్కువగానే ఉంది. మారుమూల గ్రామంలో ఎక్కడ వీధిలైట్ వెలుగుతోందో కూడా డ్యాష్ బోర్డు తాను చూసి చెబుతానని చంద్రబాబు అంటుంటారు. వీధిలైట్లే కాదు.. వయాగ్ర టాబ్లెట్లు కొనుగోలు చేసినా సరే ఆ వివరాలను కూడా చూపుతోంది డ్యాష్ బోర్డు. కొండలి శ్రీనివాస్ అనే ఇంజనీర్ పరిశీలనలో చంద్రబాబు డ్యాష్ బోర్డు సంగతి మొత్తం తేలిపోయింది.
డ్యాష్ బోర్డులో అన్న సంజీవిని సెగ్మెంట్‌లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జనరిక్ మందులు కొనుగోలు చేస్తున్న వారి వివరాలను రికార్డు చేస్తున్నారు. షాప్, ప్రాంతం, వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్, కొన్న మెడిసిన్ ఇలా అన్ని వివరాలను రికార్డు చేస్తున్నారు. ఇలా చేయడం సరైన పద్దతి కాదని చెప్పినా వినకుండా వాటిని రికార్డు చేశారు. అయితే ఇప్పుడు ఆ డేటా మొత్తం ఆన్‌లైన్లోకి రావడంతో కలకలం రేగింది.
అనంతపురంలో వయాగ్రాకు జనరిక్ మందైన సుహగ్రా టాబ్లెట్లను కొన్న వారి వివరాలన్ని బయటకు రావడాన్ని ఇంజనీర్ గమనించారు. వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్, షాప్ ఐడీ ఇలా అన్ని ఆన్‌లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ వివరాలను ఏ వ్యక్తి అయినా సరే చూసుకునే అవకాశం ఉంది. దీంతో వ్యక్తుల గోప్యతను డ్యాష్ బోర్డు నాశనం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి. చివరకు వయాగ్రా వాడే వారి వివరాలు కూడా పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తే వారి పరిస్థితి ఏమైపోవాలి అని ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ సీఎం డ్యాష్ బోర్డు నుంచి లక్ష 34వేల మంది ఆదార్ కార్డు డేటా లీక్ అయినట్టు గుర్తించారు. ఇప్పుడు ఏకంగా వ్యక్తులు కొనుగోలు చేసిన మందులు, వారికున్న జబ్బులు, ఫోన్ నెంబర్లు కూడా డ్యాష్ బోర్డులో అందరికీ అందుబాటులో ఉంచడం కలకలం రేపుతోంది.