యువనటి శ్రీరెడ్డితో సినీనటుడు పవన్ కల్యాణ్‌ని తిట్టించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై నిర్మాత అల్లు అరవింద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వర్మ నికృష్టుడని, సాఫ్ట్ మర్డర్ క్రిమినల్ అని సినీ నిర్మాత ఆయనపేర్కొన్నారు. తాను మెగా ఫ్యామిలీకి పెద్దగా ఇన్ని రోజులు సహనంగా ఉన్నానని, కానీ కొన్ని సంఘటనలు చూశాక ప్రెస్‌మీట్ పెట్టానన్నారు. శ్రీరెడ్డి ఆరోపణలపై సినీ పరిశ్రమ సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఇండస్ట్రీ మంచిపని చేయబోతోంది. రిడ్రెస్సల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కమిటీలో 50 శాతం ఇండస్ట్రీ వ్యక్తులతో పాటు మహిళలు, ఎన్‌జీవోలు ఉంటారు. తప్పు చేసిన నిర్మాత, దర్శకులు ఎవరైనా ఉన్నారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
వర్మ చివరకు సారీ అంటున్నారు.. పవన్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. శ్రీరెడ్డి చేయాలనుకున్న నిరసనను ఆమె చేయొచ్చు. కానీ, పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయమని వర్మ చెప్పారు. అసభ్యకరంగా పదజాలం వాడుతూ, వేలు చూపించాలని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ చుట్టూ ఒక నీచపు వర్గం కూడా ఉంది.
వీడియోలో దగ్గుబాటి సురేశ్ ఫ్యామిలీ నుంచి రూ.5 కోట్లు ఇప్పిస్తానని వర్మ అన్నారు. పవన్ కల్యాణ్‌పై చేసిన ఈ కుట్రల వెనుక వర్మ వెనుక కూడా ఇంకా ఎవరు ఉన్నారు? అనేక సందేహాలతో నాకు రాత్రి నిద్రపట్టలేదు. ఒక మనిషి సమాజంలో పేరు తెచ్చుకుంటుంటే అతడి పేరును ఎలా తగ్గించాలని కుట్రలు పన్నుతున్నారు. అలాగే పవన్ కల్యాణ్‌పై వర్మకి ఉన్న కోపాన్ని శ్రీరెడ్డితో తీర్చుకోవాలని చూశారు.
వర్మ… నీ తల్లినో, భార్యనో, కూతురిపైనో అటువంటి పదాలు వాడితే నీవు ఎంతగా బాధపడతావు. ఇండస్ట్రీలోని ఓ కుటుంబంపై నీకు బాధ్యత ఉందని దగ్గుబాటి సురేశ్ కుటుంబాన్ని కాపాడాలని రూ.5 కోట్లతో డీల్ చేయాలని అనుకున్నానని వర్మ అన్నారు. మరి మెగా కుటుంబం కూడా ఇండస్ట్రీకి చెందిందే కదా? ఈ కుటుంబంపై మాత్రం ఇటువంటి వ్యాఖ్యలు చేయిస్తావా? ఇండస్ట్రీలోని కుటుంబంపై నీకు అంత జాగ్రత్త ఉందా?
టాలీవుడ్ ఇండస్ట్రీ నిన్ను పైకి తీసుకొచ్చింది. నాగార్జునతో మొదటి సినిమా తీశావు. అటువంటి ఇండస్ట్రీకి ఎందుకు ద్రోహం చేశావు? ఒక క్రైమ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు చేశారు. తడిగుడ్డతో గొంతు కోసే రకంగా వర్మ ప్రవర్తిస్తున్నారు. దీని వెనుక వర్మ పాత్ర ఉందని రుజువైంది. ఈ ఇష్యూని ఇండస్ట్రీ ఏం చేస్తుందనేది వారికే వదిలేస్తున్నా అని తెలిపారు.