మాజీ ప్రధాని, తెలంగాణ నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన అపర చాణక్యుడు పీవీ నరసింహారావు. బతికున్నపుడు అంతగా పట్టించుకోని రాజకీయ నాయకులు.. ఇప్పుడు ఆయన కాలం చేసిన ఇన్నాళ్లకు తగిన గౌరవం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే.. పీవీకి తగిన గౌరవం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో దసరా నాటికి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టి.. అందుకోసం కసరత్తు కూడా తీవ్రం చేసింది. కరీంనగర్ జిల్లా నుంచి కొత్తగా జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలను ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తోంది. ఇందులో ఓ జిల్లాకు పీవీ పేరు పెట్టాలని ప్రభుత్వానికి జిల్లాకు చెందిన కొందరు నేతలు సూచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎలాగూ.. వరంగల్ జిల్లాలో భూపాలపల్లి జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రయత్నంలోనే.. పీవీకి కూడా తగిన గౌరవం ఇస్తే.. బాగుంటుందని సీఎం కేసీఆర్ కు సలహా ఇస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం కూడా ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. దసరా నాటికి కొత్త జిల్లాలు ఏర్పడతాయి కాబట్టి.. ఆ లోపు ఈ విషయాన్ని పరిశీలించాలని నిర్ణయించినట్టు సమాచారం.